టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుకి హైకోర్టు ధర్మాసనం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బిజెపికి మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఈ కేసు దర్యాప్తుకి హైకోర్టు సింగిల్ జడ్జి అనుమతించడాన్ని సవాలు చేస్తూ బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సివి భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వం రాజకీయ దురుదేశ్యంతోనే ఈ కేసుతో బిజెపిని జాతీయస్థాయిలో దెబ్బతీయాలని కుట్ర పన్నుతోందని, కనుక తెలంగాణ ప్రభుత్వ కనుసన్నలలో పనిచేస్తున్న పోలీసులు ఈ కేసును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారనే నమ్మకం తమకు లేదని బిజెపి తరపు న్యాయవాది సిహెచ్ వైద్యనాధన్ వాదించారు. కనుక ఈ కేసు దర్యాప్తు బాధ్యతను మరో సంస్థకు అప్పగించాలని కోరుతున్నామన్నారు. పోలీసులు ఈ కేసు నమోదు ప్రక్రియ నుంచే తప్పుడు రికార్డులు, సాక్షాధారాలు సృష్టించే ప్రయత్నాలు చేశారని వాదించారు.
తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది దుష్యంత్, క్రిమినల్ కేసులను అడ్డుకోరాదని సుప్రీం కోర్టు విస్పష్టంగా చెప్పినప్పటికీ, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ దర్యాప్తు కూడా జరుపకుండా అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తోందని వాదించారు. ఈ వ్యవహారంలో నిందితులతో బిజెపీకి సంబందమే లేదని చెప్పుకొంటూ, ఈవిదంగా నిందితులను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని వాదించారు. కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేసిందని, తనకు లొంగని మంత్రులను అరెస్టులు చేయించి వేధించిందని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కూల్చివేయడానికి ప్రయత్నించి దొరికిపోయిందని న్యాయవాది దుష్యంత్ వాదించారు. ఈ కేసులో నిందితులు సుప్రీం కోర్టుని ఆశ్రయించినా దర్యాప్తు నిలిపివేసేందుకు అంగీకరించలేదని గుర్తుచేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈ కేసు దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం హైదరబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ బృందం తన నివేదికలను సింగిల్ జడ్జికి మాత్రమే సమర్పించాలని, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మేల్యేలకు, మీడియాకి మరెవరికీ ఈ కేసు దర్యాప్తుకి సంబందించి ఎటువంటి వివరాలు తెలియజేయరాదని, దర్యాప్తు అధికారులు ఈ కేసు గురించి మీడియాకి ఇంటర్వ్యూలు, లీకులు ఇవ్వరాదని హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసుపై సిట్ దర్యాప్తుకి హైకోర్టు అనుమతించడం బిజెపీకి పెద్ద ఎదురుదెబ్బే అని భావించవచ్చు. అయితే ఈ కేసుతోనే బీజేపీని రాజకీయంగా దెబ్బతీయాలని భావిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా హైకోర్టు తాజా తీర్పు బ్రేకులు వేసినట్లయిందని భావించవచ్చు. తమ చేతిలో ఉండే సిట్ బృందమే ఈ కేసులో కీలకసమాచారం కనిపెట్టినప్పటికీ ఆ విషయాలు ప్రభుత్వానికి తెలియజేయకూడదని హైకోర్టు ఆదేశించింది కనుక ఈ కేసు దర్యాప్తులో బయటపడే అంశాలను టిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే కావలసిన సమాచారమంతా సిట్ బృందం నుంచి సిఎం కేసీఆర్ అనధికారికంగా పొందగలరు కనుక తదనుగుణంగా వ్యూహాలు రచించుకొనే వెసులుబాటు ఉంటుంది. ఈ కేసు దర్యాప్తుకి హైకోర్టు అనుమతించడం బిజెపీకి ఎదురుదెబ్బే అని భావించవచ్చు.