టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతరావు, హర్షవర్ధన్ రెడ్డిలకు ఇతర రాష్ట్రాల నుంచి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తమని కేసులను ఉపసంహరించుకోవాలని లేకుంటే చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారిలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గచ్చిబౌలిలో, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి బంజారాహిల్స్‌లో, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా పిర్యాదులు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇప్పటికే వారి ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. సిట్ ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్‌తో సహా ఏపీ, కర్నాటక, కేరళ, హర్యానా రాష్ట్రాలలో రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్‌లకు సంబందించిన ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు చేయడానికి వెళ్ళాయి. ఆయా రాష్ట్రాలలో వారితో పరిచయాలు కలిగినవారిని, నిందితుల బంధుమిత్రులను ప్రశ్నించడానికి తరలివెళ్ళారు. హైదరాబాద్‌లో ఫిల్మ్ నగర్లో నంద కుమార్‌కి చెందిన డెక్కన్ కిచన్ హోటల్లో సిట్ బృందం శనివారం తనికీలు నిర్వహించి, సిసి కెమెరా రికార్డులను స్వాధీనం చేసుకొంది. ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నవారిని కనిపెట్టి పట్టుకొనేందుకు మరో బృందం సిద్దం అవుతోంది.