
ఈరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకొన్న ప్రధాని నరేంద్రమోడీకి ఎప్పటిలాగే సిఎం కేసీఆర్ మొహం చాటేశారు. ఎప్పటిలాగే ప్రోటోకాల్ కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని మాత్రం పంపించారు. ప్రధాని నరేంద్రమోడీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర బిజెపి నేతలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం బేగంపేట విమానాశ్రయం వద్ద జరిగిన బిజెపి కార్యకర్తల సభలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వస్తే, ఆయనకు సాదరంగా స్వాగతం పలకాలనే కనీసం మర్యాద కూడా తెలంగాణ ప్రభుత్వానికి (సిఎం కేసీఆర్) లేదు. దేశంలో మరెక్కడా ఇటువంటి విపరీత ధోరణి లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈవిదంగా జరుగుతోంది. సిఎం కేసీఆర్ నిరంకుశ నైజాం నవాబు వంటివారు. గవర్నర్ ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమెను కూడా కేసీఆర్ అవమానిస్తున్నారు.
తెలంగాణలో ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ వస్తే నిరసనలు, ఆందోళనలు చేయిస్తూ అవమానిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ మళ్ళీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వస్తూనే ఉంటారు. కానీ వెయ్యి మంది కేసీఆర్లు కట్టకట్టుకొని వచ్చినా ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకోలేరు. కేసీఆర్ వైఖరి వలన యావత్ తెలంగాణ రాష్ట్రనికి నష్టం జరుగుతోంది. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిపోయింది. కేసీఆర్ చేతిలో చిక్కుకొన్న తెలంగాణ రాష్ట్రానికి బిజెపియే విముక్తి కల్పిస్తుంది,” అని అన్నారు.