నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అరెస్టయిన రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్ల పోలీస్ కస్టడీ, రిమాండ్ గడువు కూడా శుక్రవారంతో ముగియడంతో పోలీసులు వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారు ముగ్గురికీ ఈ నెల 25వరకు రిమాండ్ పొడిగించింది. నిందితులు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
ఈ కేసుపై దర్యాప్తు కోసం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ పోలీస్ బృందం శుక్రవారం ఉదయం వారిని చంచల్‌గూడ జైలు నుంచి నేరుగా నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసుకువెళ్ళి వారికి స్వర (వాయిస్)పరీక్షలు చేయించారు. ఫామ్‌హౌస్‌లో పోలీసులు రికార్డ్ చేసిన వారి సంభాషణలు అసలైనవే అని శాస్త్రీయంగా నిరూపించేందుకు ఇది చాలా అవసరం. ఆ తర్వాత వారు ముగ్గురినీ రాజేంద్ర నగర్లో పోలీస్ స్టేషన్‌కి తరలించి అక్కడ వేర్వేరుగా ప్రశ్నించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేతో బేరసారాలు చేసిన నందకుమార్, తరచూ ఢిల్లీ ఎందుకు వెళ్ళివచ్చేవారని సిట్ బృందం ప్రశ్నించినప్పుడు ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన విచారణలో ముగ్గురు నిందితులు విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెప్పకుండా తప్పించుకొనే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.