కేసీఆర్ తలుచుకొంటే...

రాజుగారు తలుచుకొంటే దెబ్బలకి కరువా? అన్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ తలుచుకొంటె సాధ్యం కానిది ఏముంటుంది? ఆయన జిల్లాల పునర్విభజన చేయాలనుకొన్నారు. ఎవరు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా చేసేశారు. ఆయన పాత సచివాలయాన్ని కూల్చి వేసి కొత్తది కట్టుకోవాలనుకొన్నారు. ఆ పని చేసేయబోతున్నారు. ప్రైవేట్ కాలేజీలకి బాకీ ఉన్న రూ.600 కోట్లు రెండు వారాలలోనే ఇచ్చేయలనుకొన్నారు. ఇచ్చేస్తున్నారు. అచ్చమైన తెలంగాణా పేరు యాదగిరిగుట్ట పేరుని మార్చేయాలనుకొన్నారు అంతే గుట్ట కాస్తా యాదాద్రి అయిపోయింది. దేవుడి కొండకి కూడా పేరు మార్చగలగడం కేవలం కెసిఆర్ కే చెల్లునేమో? అవసరమనుకొంటే ఆ దేవుడి పేరు కూడా మార్చేస్తారేమో? జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిపోయిన తరువాత ఇవ్వాళ్ళ యదాద్రి జిల్లా పేరు కూడా మార్చేయాలనుకొన్నారు. వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లాగా పేరు పెట్టేశారు. అందుకే రాజుగారు తలుచుకొంటే దెబ్బలకి కరువా? అని అనుకోకతప్పదు. 

ఈరోజు ఆయన యాద్రాద్రి జిల్లా సారీ...యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట సారీ..యాదాద్రి పర్యటనకి వచ్చినప్పుడు, యాదాద్రి అభివృద్ధి పనులని సమీక్షించి అధికారులకి అవసరమైన సలహాలు ఇచ్చారు. ఆ పవిత్ర క్షేత్రం పాదాల చెంతన ఉన్న భువనగిరి కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రోజుకి లక్ష మంది భక్తులు వచ్చినా సౌకర్యంగా ఉండేవిధంగా యాదాద్రిని, పట్టణాన్ని తీర్చి దిద్దుతామని కెసిఆర్ చెప్పారు. 

యాదాద్రికి నాలుగు వైపులా నాలుగు రోడ్ల రహదారులు ఏర్పాటు కోసం, స్వామివారి పూజల కోసం చుట్టూ పూల తోటల పెంపకం, అదేవిధంగా దగ్గరలోనే ఉన్న గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్లని, చెరువులని అభివృద్ధి చేయాలని అధికారులని ఆదేశించారు. యాదాద్రిలో కాటేజీల నిర్మాణం, భక్తులకి సౌకర్యాల కల్పన కోసం అవసరమైన ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. తదనుగుణంగా అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులని ఆదేశించారు. కెసిఆర్ తలుచుకోవడం..పనులు కాకపోవడమా? చేసేది మంచి పనే కనుక మెచ్చుకోవలసిందే.