నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై పోలీసులు దర్యాప్తుకి హైకోర్టు అనుమతించడంతో తెలంగాణ ప్రభుత్వం బుదవారం హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సీవి ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. దీనిలో నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైంస్ డీఎస్పీ కల్మెశ్వర్ సింగెనవార్, శంషాబాద్ డీఎస్పీ జగదీశ్వర్ రెడ్డి, నారాయనపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఎస్పీ గంగాధర్, మొయినాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ లక్ష్మీరెడ్డిలు సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్‌లను ప్రశ్నించేందుకు రెండు రోజులు (గురు, శుక్రవారం) పోలీస్ కస్టడీకి కూడా హైకోర్టు అనుమతించినందున ఈ బృందం నేడు వారిని ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టనుంది.
గత నెల 26వ తేదీన మొయినాబాద్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో ముగ్గురు నిందితులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపిలో చేరేందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి రూ.100 కోట్లు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతరావులకు ఒక్కొక్కరికీ రూ.50 కోట్లు చొప్పున ఇస్తామని ప్రలోభపెడుతుండగా పోలీసులు వారిని వలపన్ని పట్టుకొన్న సంగతి తెలిసిందే. ముగ్గురు నిండితూ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. వారి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.