ఫామ్‌హౌస్ వ్యవహారంలో బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డంగా ఇరికించిన సిఎం కేసీఆర్‌ను దెబ్బకు దెబ్బ తీసేందుకు కేంద్రం పావులు కదపడం మొదలుపెట్టింది. ఈరోజు మంత్రి గంగుల కమలాకర్‌కి చెందిన హైదరాబాద్, కరీంనగర్‌లో ఇళ్ళు, గ్రానైట్ కంపెనీలు, వాటి కార్యాలయాలలో ఐటి, ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి.
మంకమ్మతోటలోని మంత్రి గంగుల కమలాకర్‌కి చెందిన శ్వేత గ్రానైట్‌తో పాటు, ఎస్వీఆర్ గ్రానైట్స్, మహావీర్ గ్రానైట్స్, హైదరాబాద్, పంజగుట్టవద్ద గల పీఎస్ఆర్ గ్రానైట్స్, సోమాజీగూడలోని గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలో, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఈరోజు ఉదయం నుంచి ఐటి, ఈడీలకు చెందిన 20 బృందాలు ఏక కాలంలో సోదాలు చేస్తున్నాయి. ఈ గ్రానైట్ కంపెనీలన్నీ ఫెమా నిబందనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా లావాదేవీలు చేస్తున్నాయని గతంలోనే వీటన్నిటికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. మళ్ళీ ఇప్పుడు వాటిపై ఆకస్మిక దాడులు చేస్తున్నాయి.
గ్రానైట్ వ్యాపారంలో గనుల అక్రమ తవ్వకాలు, అక్రమ ఆర్ధిక లావాదేవీలు సర్వసాధారణం. కనుక ఐటి, ఈడీ తలుచుకొంటే చాలా సులువుగా అందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోగలవు. కానీ దీని వెనుక పార్టీల రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు కూడా ఉంటాయి కనుక ఈ ఉచ్చులో బిగించి ఉంచుకొని అనుకూలంగా మార్చుకోవడం పెద్ద సమస్య కాదు. ఈ సోదాలను సిఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు ముందే ఊహించారు. కానీ వాటితో తమను భయపట్టలేరని పదేపదే చెపుతున్నారు. కనుక ఈ సోదాలపై ఇప్పుడు వారు ఏవిదంగా వ్యవహరిస్తారో చూడాలి.