డిల్లీ ముఖ్యమంత్రికి డిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనతో సహా మరో నలుగురు ఆమాద్మీ పార్టీ నేతలపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసు విచారణని నిలిపివేయవలసిందిగా దిగువ కోర్టుని ఆదేశించాలని కోరుతూ వేసిన పిటిషన్ని హైకోర్టు తిరస్కరించింది. ఆ కేసుని నిలిపివేయడానికి అరవింద్ కేజ్రీవాల్ బలమైన కారణాలు ఏవీ చూపించలేకపోయినందున, దిగువ కోర్టు నిరభ్యంతరంగా పరువు నష్టం దావా కేసుని విచారించవచ్చని హైకోర్టు తీర్పు చెప్పడంతో అరవింద్ కేజ్రీవాల్, ఆయన అనుచరులకి ఎదురుదెబ్బ తగిలింది.
ఒకప్పుడు అరుణ్ జైట్లీ డిల్లీ క్రికెట్ అసోసియేషన్ కి చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా బారీ కుంభకోణం జరిగిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన ఆరోపణలని మొదట అరుణ్ జైట్లీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ పదేపదే ఆరోపణలు చేస్తుండటంతో, తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినట్లయితే పరువు నష్టం దావా వేస్తానని జైట్లీ హెచ్చరించారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోపణలు కొనసాగించడమేకాక, అటువంటి అవినీతిపరుడుని మోడీ మంత్రివర్గంలో కొనసాగించడం తప్పు అన్నట్లుగా మాట్లాడటంతో జైట్లీకి సహనం నశించి అరవింద్ కేజ్రీవాల్, ఆయన అనుచరులపై పరువు నష్టం దావా వేశారు.
ఆ కుంభకోణంపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి అరవింద్ కేజ్రీవాల్ ఒక కమిటినీ కూడా వేశారు. కానీ దాని దర్యాప్తులో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తేలడంతో అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో చిక్కుకుపోయారు. దాని నుంచి బయటపడేందుకు హైకోర్టుని ఆశ్రయిస్తే అదికూడా ఆయన అభ్యర్ధనని తిరస్కరించడంతో అరవింద్ కేజ్రీవాల్ ముందు దారి మూసుకుపోయినట్లు అయింది. దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు కానీ కేసు కొట్టివేసేందుకు బలమైన కారణాలు చూపించవలసి ఉంటుంది. అవి చూపించలేకపోవడం వలననే హైకోర్టులో భంగపడ్డారు. కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళినా అక్కడా అదే పరిస్థితి ఎదురవవచ్చు. అదే జరిగితే, అరవింద్ కేజ్రీవాల్ తన నోటి దురదకి బారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.