గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, సోమవారం సాయంత్రం సూరత్ స్టేషన్ సమీపంలో ఆయన కూర్చోన్న బోగీపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. ఆ దాడిలో కిటికీ అద్దం పగిలింది కానీ అసదుద్దీన్ ఓవైసీకి ఏం కాలేదు.
తమపై బిజెపి దాని అనుబంద సంస్థలకు చెందిన వ్యక్తులు ఎవరో రాళ్ళ దాడికి ప్రయత్నించి ఉంటారని, కానీ ఇటువంటి బెదిరింపులు, దాడులకు భయపడి వెనక్కు తగ్గేదేలేదని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన పశ్చిమ రైల్వే పోలీస్ ఎస్పీ రాజేష్ పర్మార్ దీనిపై దర్యాప్తు జరిపామని తెలిపారు. అయితే అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న బోగీపై ఎవరూ రాళ్ళ దాడి చేయలేదని, భరూచీ జిల్లా అంక్లేశ్వర్ వద్ద రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయని, కొన్ని రాళ్ళు ఓ బోగీపై పడ్డాయని చెప్పారు. అయినప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదుపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతామని తెలిపారు. రాళ్ళు తగిలి పగిలిన కిటికీ అద్దాన్ని తక్షణం మార్పిస్తామని అసదుద్దీన్ ఓవైసీకి అసౌకర్యం కలిగినందుకు క్షమించమని కోరుతున్నామని చెప్పారు.
కనుక బిజెపి కంచుకోట గుజరాత్‌లో అడుగుపెడుతున్న అసదుద్దీన్ ఓవైసీ ప్రచారంలో పాల్గొన్నప్పుడు కూడా ఎక్కడైనా రోడ్డు మరమత్తులు చేస్తున్నప్పుడు ఇలాగే రాళ్ళు ఎగిరివచ్చి తగిలే ప్రమాదం ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తలు తీసుకొంటే మంచిదేమో?