ఫామ్‌హౌస్‌ ఫైల్స్... దర్యాప్తు చేసుకోవచ్చు: హైకోర్టు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించిన ఫామ్‌హౌస్‌లో నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ కేసు దర్యాప్తుపై విధించిన స్టేని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. మొయినాబాద్ పోలీసులు ఆ కేసుపై దర్యాప్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. 

అయితే ప్రస్తుతం ఈ కేసులో మరో పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా విచారణ చేస్తునందున సుప్రీంకోర్టు నుంచి కూడా అనుమతి రావలసి ఉంటుంది. ఈ కేసులో తొందరపడితే ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరు చేసేస్తామని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కనుక ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏం చెపుతుందో వేచి చూడక తప్పదు. 

నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నంద్ కుమార్‌ ముగ్గురూ తమను రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించిందని, టిఆర్ఎస్‌-బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ పోరుతో తమకు సంబందం లేదని కనుక తమకి ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపైనే సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. కనుక సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న ఈ కేసుపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టడానికి మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదేమో?