హైదరాబాద్‌లో 17వ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం త్వరలో

స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ (ఎస్‌ఆర్‌డీపీ) కార్యక్రమంలో భాగంగా శిల్పా లేఅవుట్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ నిర్మాణపనులు పూర్తిచేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 20వ తేదీన మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌ నగరంలో 16 ఫ్లైఓవర్లు నిర్మాణాలు పూర్తికాగా ఇది 17వ ఫ్లైఓవర్‌. 

 అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ మీదుగా శిల్పా లేఅవుట్ వరకు రెండువైపులా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఓఆర్ఆర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు దీని పొడవు 456.64 మీటర్లు, రెండో వైపు 399.95 మీటర్లు కాగా 16.60 మీటర్ల వెడల్పుతో సువిశాలంగా నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే హైటెక్ సిటీ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మద్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలకు చాలా సౌకర్యంగా ఉంటుంది.     

గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు సర్వీస్ రోడ్డుగా ఉపయోగించబడుతున్న మార్గంలో 473 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో అప్‌ ర్యాంప్‌పై ఓ ఫ్లైఓవర్‌, అలాగే మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు డౌన్‌లోడ్‌ ర్యాంపుపై 522 మీటర్ల పొడవు, 8050 మీటర్ల వెడల్పుతో మరో ఫ్లైఓవర్‌ నిర్మాణం జరుగుతోంది.         

ఇవికాక ఈ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు 816 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో మరో భారీ ఫ్లైఓవర్‌ నిర్మాణపనులు జోరుగా సాగుతున్నాయి. ఇది 2023, జూలై నాటికి ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.