సబితా రెడ్డిగారు.. ఓ సారి రాజ్‌భవన్‌ వస్తారా మాట్లాడాలి!

తెలంగాణ విద్యాశాఖకు సంబందించిన బిల్లులపై చర్చించేందుకు ఓసారి రాజ్‌భవన్‌కు రావలసిందిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ వ్రాశారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేయాలనే బిల్లుని తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదించి గవర్నర్‌ ఆమోదం కొరకు పంపాయి. వాటిపై గవర్నర్‌ కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. కానీ ప్రభుత్వం తరపున ఎవరూ వచ్చి వివరణ ఇవ్వకపోవడంతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆ బిల్లుతో సహా మరో ఆరు బిల్లులకు ఆమోదముద్ర వేయకుండా పక్కనపెట్టేశారు.

ఆ కారణంగా విశ్వవిద్యాలయాలలో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ బిల్లులను తక్షణ ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామంటూ తెలంగాణ విశ్వవిద్యాలయాల ఐకాస హెచ్చరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గవర్నర్‌ పట్టుబడుతున్నారు. ఈ బిల్లుపై న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉంటాయా లేదా అని వివరణ కోరుతూ ఆమె యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్‌)కు కూడా ఓ లేఖ వ్రాశారు. ఈలోగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఓ లేఖ వ్రాశారు. 

అయితే ఇప్పటికే గవర్నర్‌ రాజకీయాలు చేస్తున్నారంటూ సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్ళకపోవచ్చు. వెళ్ళకపోతే గవర్నర్‌ తమిళిసై ఆ బిల్లులను ఆమోదించకపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఆమెకు, ప్రభుత్వానికి మద్య ఘర్షణ మొదలవుతుంది.