సార్! ఎమ్మెల్యేగారూ మీరూ రాజీనామా చేయొచ్చు కదా?

తెలంగాణలో దుబ్బాక, హుజురాబాద్‌, తాజాగా మునుగోడులో ఉపఎన్నికలు జరిగినపుడు ఆయా నియోజకవర్గాలలో యుద్ధప్రాతిపదికన పూర్తిచేసిన అభివృద్ధి పనులను, ఆ ఎన్నికలలో రాజకీయ పార్టీలు ఓటర్లకు పంచిపెట్టిన డబ్బు, విలువైన బహుమతులను నిశితంగా గమనిస్తున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొందరు తమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి, “సార్! ఎమ్మెల్యేగారూ మీరూ రాజీనామా చేయొచ్చు కదా?మీరు రాజీనామా చేసి ఉపఎన్నికలొస్తే మన నియోజకవర్గంలో కూడా అభివృద్ధిపనులు జరుగుతాయి. మాకూ నాలుగు పైసలు వస్తాయి కదా సార్?” అంటూ అడుగుతున్నారు.  

ధర్మపురి, పెద్దపల్లి, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, దాశ్రీ మనోహర రెడ్డి, ఒడితల సతీష్ బాబులకి ఇటువంటి ఫోన్లు వచ్చాయని తెలుస్తోంది. ఎలిగేడు మండలం బుర్హాన్ మియాపేటకి చెందిన రంజిత్ రెడ్డి అనే యువకుడు ఎమ్మెల్యే మనోహర రెడ్డికి ఫోన్‌ చేయగా, హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలోని వెంకటేశ్వరపల్లికి చెందిన కంది సతీష్ రెడ్డి అయే యువకుడు ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ చేశారు. ఊర్లో రోడ్లు బాగోలేవని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు కనుక మీరు రాజీనామా చేస్తే మా సమస్యలన్నీ తీరుతాయని ఆ యువకుడు కోరడంతో ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ షాక్ అయ్యారు.

ఇక మంత్రి గంగుల కమలాకర్‌కి ఇటువంటి ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి. అదీ... కువైట్ నుంచి! నియోజకవర్గం పరిధిలోని పెగడపల్లి మండలం బతికపల్లికి చెందిన క్యాతం రమేష్ కొంతకాలంగా కువైట్‌లో పనిచేస్తున్నాడు. అతను సెలవులో ఎప్పుడు ఊరికి వచ్చిన అవే గుంతలుపడిన రోడ్లు చూసి చూసి విసుగెత్తిపోయాడు. ఇటీవల మంత్రి గంగులకు ఫోన్‌లో చేసి "మీరు నా ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు మంత్రిగా ఉన్నా మా గ్రామం పరిస్థితి మారలేదు. మంత్రిగా ఉండి మీరు చేయలేకపోతున్న పని రాజీనామా చేస్తే పూర్తవుతుందేమో? కనుక నియోజకవర్గం అభివృద్ధి కోసం మీ పదవికి రాజీనామా చేసి చిన్న త్యాగం చేయండి,” అని అడిగినట్లు తెలుస్తోంది.