నేను ఏ తప్పు చేయలేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడినవారిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఒకరు. కనుక ఆ పదవి దక్కకపోయినప్పటికీ ఆయన ఎప్పటిలాగే పార్టీకి విధేయంగా, నమ్మకంగా ఉంటారని ఆశించడం సహజం. కానీ ఆయన పార్టీకి అత్యంత కీలకమైన మునుగోడు ఉపఎన్నికలకు మొహం చాటేయడమే కాకుండా బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు నియోజకవర్గంలో తన అనుచరులందరూ సహకరించాలని ఫోన్లు చేసి చెప్పారు. పైగా మునుగోడులో కాంగ్రెస్‌ ఓడిపోతుందని చెప్పడం ద్వారా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. పార్టీకి నష్టం కలిగించారు. 

కనుక కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు రెండు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించమని కోరింది. మొదటి నోటీసుని ఆయన పట్టించుకోలేదు కానీ రెండో నోటీసుకి జవాబిచ్చానని ఆయన చెప్పారు. 

తాను 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయంగా పనిచేస్తున్నానని, పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొంటున్నానని అయినా ఏనాడూ పార్టీకి ద్రోహం తలపెట్టలేదని ఆ లేఖలో తెలియజేసినట్లు చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలకి సంబందించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో సంభాషణలు తనవి కావని ఎవరో తన గొంతుతో ఆవిదంగా చేసి ఉండవచ్చని అధిష్టానానికి తెలియజేసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 

ప్రస్తుతం తెలంగాణలో భారత్‌ జోడో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలందరూ కలిసారు కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా నుంచి తిరిగివచ్చినప్పటికీ ఇంతవరకు కలవలేదు. కనుక ఆయనకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగే ఉద్దేశ్యం లేదని అర్దమవుతోంది. ఒకవేళ మునుగోడు ఉపఎన్నికలలో తన తమ్ముడు గెలిస్తే ఆయన కూడా బిజెపిలో చేరిపోవాలని ఎదురుచూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి వెంకట్ రెడ్డి ఏం చేయబోతున్నారో ఆయన ఇచ్చిన ఈ వివరణపై కాంగ్రెస్‌ అధిష్టానం ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.