
సిఎం కేసీఆర్ గురువారం రాత్రి ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి బిజెపి, కేంద్ర ప్రభుత్వం కలిసి తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్రలు పన్నాయని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలంటూ చేసిన సుదీర్గ ప్రసంగంపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ధీటుగా స్పందించారు.
“కేసీఆర్ చెప్పిన మాటలు వింటే కొండను తవ్వి ఎలుకని పట్టిన్నట్లుంది. ఈ వ్యవహారంతో మా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదు. అదంతా కేసీఆర్ ఊహాజనితమైన డ్రామా మాత్రమే. దానికి స్క్రీన్-ప్లే ధర్శకత్వం కేసీఆరే స్వయంగా నిర్వహించారు. అయినా ఓ ఎమ్మెల్యే లేదా ఓ స్వామీజీయో తలుచుకొంటే పడిపోయే అంత బలహీనంగా ఉందా కేసీఆర్ ప్రభుత్వం? కేసీఆర్ జాతిరత్నాలని, తెలంగాణ హీరోలని గొప్పగా చెప్పుకొంటున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచి మీ పార్టీలో చేరారో ప్రజలందరికీ తెలుసు. అటువంటి జాతిరత్నాలు మాకు అవసరమే లేదు.
కేసీఆర్ మాటలతో తనలోని భయాందోళనలు, అభద్రతాభావం బయటపెట్టుకొన్నారు తప్పితే కొత్తగా చెప్పిందేమీ లేదు. అయినా గత ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో నియంతృత్వ పాలన చేస్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ మేము టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను మా పార్టీలోకి ఆకర్షించాలనుకొంటే మాకు బ్రోకర్లు, స్వామీజీలు అవసరమా? మేమే నేరుగా ఆ పనిచేయలేమా?
కేసీఆర్‌కి బ్రోకర్లు, స్వామీజీలతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసుకొని ఉండవచ్చు కానీ మేము మాత్రం ఎవరైనా మా పార్టీ సిద్దాంతాలు నమ్మి వస్తామంటేనే చేర్చుకొంటాము తప్ప వారికి వందల కోట్లు ఈయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మాది జాతీయ పార్టీ. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కనుక మా పార్టీలో చేరాలనుకొనేవారు చాలా మందే ఉన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మా పార్టీలో చేర్చుకొనేటప్పుడు ముందుగా ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాము కదా? మరటువంటప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి చేర్చుకోవలసిన ఖర్మ మాకేమిటి? కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలద్రోయాలని మేము ప్రయత్నించలేదు.
ఆయనే తన కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేకపోతాడేమో అని బెంగపెట్టుకొని నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఈ కట్టు కధ అల్లి, వారితో ఈ డ్రామా షూట్ చేయించి మా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే తన డ్రామా అంతా బయటపడుతుందనే భయంతోనే బ్యాక్ డేట్‌తో సీబీఐ దర్యాప్తులకి అనుమతి నిరాకరిస్తూ రహస్యంగా జీవో జారీ చేశారు. కేసీఆర్ ఇది నిజం కాదనగలరా?” అంటూ ఘాటుగా స్పందించారు.