మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ విజయం సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఏవైనా ఎన్నికలలో టిఆర్ఎస్ గెలిస్తే సిఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతుంటారు. మునుగోడులో పోలింగ్ ముగిసిన రెండు గంటలకే సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటం కూడా అదే సూచిస్తోంది. లేకుంటే ఆయన నవంబర్ 6న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎదురుచూసి ఉండేవారే.
ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సుమారు 20 వేల ఓట్ల మెజార్టీతో బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించబోతున్నారు. మునుగోడులో రికార్డు స్థాయిలో 92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగిసినప్పటికీ, ఆ సమయానికి క్యూ లైన్లో ఉన్నవారందరినీ ఓట్లు వేసేందుకు అనుమతిస్తారు కనుక మునుగోడులో కొన్ని చోట్ల రాత్రి 10 గంటల వరకు పోలింగ్ జరిగింది.
మునుగోడులో 2004లో జరిగిన ఎన్నికలలో 87.31%, 2009లో 77.15%, 2014లో 82.15%, 2018లో 91.31%, ఇప్పుడు 92% ఓటింగ్ నమోదైంది. సాధారణంగా ఓటింగ్ శాతం పెరిగినప్పుడు అధికార పార్టీకి లబ్ధి కలుగుతుంటుంది. కనుక ఈసారి టిఆర్ఎస్ గెలుపు ఖాయమని సర్వే సంస్థలు, సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ నేతలు కూడా పూర్తి నమ్మకంగా చెపుతున్నారు.
అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాము పట్టించుకోబోమని, అవి చాలాసార్లు తప్పుతుంటాయని, ఈ ఉపఎన్నికలో కూడా తమ పార్టీ గెలుపు ఖాయమని రాష్ట్ర బిజెపి నేతలు చెపుతున్నారు. నవంబర్ 6వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.