మునుగోడులో భారీగా పోలింగ్‌ నమోదు

మునుగోడులో ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు 59.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది కనుక మిగిలిన ఈ మూడు గంటలలో మరో 35-40 శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. పార్టీల పోటాపోటీగా ప్రచారం చేయడం వల్లనైతేనేమీ, ప్రలోభాల వల్లనైతేనేమి మునుగోడు ఉపఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. 

నారాయణపురం మండలంలో మధ్యాహ్నం 3 గంటలకు 59.89 శాతం, చౌటుప్పల్ మండలంలో 60.06 శాతం పోలింగ్ నమోదైంది. నారాయణపురంలో మొత్తం 36,430 మంది ఓటర్లు ఉండగా వారిలో 21,818 మంది ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. చౌటుప్పల్లో 59,433 మంది ఓటర్లలో ఇప్పటివరకు 35,698 మంది ఓట్లు వేశారు. 

ఈ ఉపఎన్నికలలో ప్రధానంగా టిఆర్ఎస్‌, బిజెపిల మద్యే పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ప్రచారం చేసింది కానీ ప్రలోభాల విషయంలో వాటితో పోటీ పడలేకపోయింది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం కల్పిస్తానని చెపుతూ బీఎస్పీ అభ్యర్ధిని కూడా మునుగోడు బరిలో దించారు. కానీ బహుజనులకు రాజ్యాధికారమే కావాలో రాజకీయ పార్టీలు ఓటుకి ఇంత చొప్పున ఇచ్చే సొమ్మే కావాలో నవంబర్‌ 6న వెలువడే ఫలితాలలో స్పష్టమవుతుంది. అప్పుడు ప్రవీణ్ కుమారే ఆలోచించుకోవలసి ఉంటుందేమో?