మునుగోడులో పోలింగ్‌ షురూ... మొదటి గంటన్నరలో 10 శాతం నమోదు

మునుగోడు ఉపఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు భారీ భద్రత మద్య మొదలైంది. మొదటి గంటన్నరలో సుమారు 10 శాతం పోలింగ్‌ జరిగినట్లు సమాచారం. ఉదయం నుంచే నియోజకవర్గంలో అన్ని పోలింగ్‌ బూతులకు జనాలు చేరుకొని క్యూలైన్లో నిలబడ్డారు. మర్రిగూడ పోలింగ్‌ బూత్ వద్ద టిఆర్ఎస్‌, బిజెపి శ్రేణుల మద్య వాదోపవాదాలు జరగడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ పోలీసులు వెంటనే కలుగజేసుకొని వారిని అక్కడి నుంచి దూరంగా పంపించివేశారు. 

టిఆర్ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దంపతులు నారాయణపురం మండలంలోని లింగవారిగూడెంలో, కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి చండూరు మండలంలోని ఇదికూడలో తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నకిరేకల్ నియోజకవర్గంలో నార్కాట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంలో ఓటు హక్కు ఉండటంతో మునుగోడు ఉపఎన్నికలలో తన ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు. అదేవిదంగా మరో 15 మంది స్వతంత్ర అభ్యర్ధులు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు.