ఓ సామాన్య ఉపఎన్నికగా జరగాల్సిన మునుగోడు ఉపఎన్నికలను దేశంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా మార్చేసిన ఘనత టిఆర్ఎస్, బిజెపిలకే దక్కుతుంది. రెండు పార్టీల మద్య మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసేవరకు హోరాహోరీగా యుద్ధాలు చేసుకొన్నాయి. ఇప్పుడు వాటిలో దేనికు మునుగోడు ప్రజలు జై కొడతారో... ఎవరి వాదనలకు మద్దతు తెలుపుతారో... ఎవరి చెల్లింపులకు మొగ్గు చూపుతారో రేపు తేలిపోతుంది.
గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని మునుగోడు ఎన్నికల నిర్వహణాధికారి వికాస్ రాజ్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2.41 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 1,21,720 మంది స్త్రీలు 1,20,128 మంది ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు ఆఫీసర్స్ ఉంటారు. మొత్తం 1,492 మంది సిబ్బంది ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన సామాగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటున్నారు.
మునుగోడులో 105 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని అక్కడ అదనంగా భద్రతదళాలను మోహరిస్తున్నామని వికాస్ రాజ్ తెలిపారు. సాయంత్రం 6గంటల వరకు ఎంత మంది క్యూలైన్లో ఉంటే వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. నవంబర్ 6వ తేదీన ఓట్లు లెక్కించి వెంటవెంటనే ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బిజెపి అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, బీఎస్పీ అభ్యర్ధిగా ఆందోజు శంకరాచారి, ప్రజాశాంతి అభ్యర్ధిగా ఆ పార్టీ అధినేత కెఏ పాల్ పోటీ చేస్తున్నారు. అయితే వీరిలో టిఆర్ఎస్, బిజెపి అభ్యర్ధుల మద్య ప్రధానంగా పోటీ ఉంటుందని ఇప్పటికే స్పష్టమైంది. మిగిలినవారు ఎవరి ఓట్లు చీల్చి ఎవరికి, ఎంత నష్టం కలిగిస్తారనేదే తేలాలి.