టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు... సుప్రీంకోర్టుకి?

నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అరెస్టయ్యి ప్రస్తుతం రిమాండ్‌పై చంచల్‌గూడ జైల్లో ఉన్న రామచంద్ర భారతి, సింహయాజి, నందు కుమార్‌ ముగ్గురూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసులో తమను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారని కనుక తమకు హైకోర్టు విధించిన 14 రోజుల రిమాండ్‌ను రద్దు చేసి విడుదల చేయాలని కోరుతూ ముగ్గురు నిందితుల తరపున వారి న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. వాటిపై శుక్రవారం విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 

ఈ కేసులో వారు ముగ్గురినీ మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేసినప్పటికీ, వారి వద్ద నుంచి పట్టుబడిన రూ.15 కోట్ల నగదును ఇంతవరకు చూపనే లేదు. కనుక ఆ డబ్బును చూపడమే కాకుండా, దానిని నిందితులే తీసుకువచ్చారని, దానిని వారు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకే తీసుకువచ్చారని, దాంతో వారిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు పక్కా సాక్ష్యాధారాలతో సహా నిరూపించవలసి ఉంటుంది. ఇదంతా సుదీర్గమైన ప్రక్రియ.

మీడియాకు లీక్ చేసిన ఫోటోలు, ఆడియో సంభాషణల ద్వారా పోలీసుల వద్ద ఈ కేసుకు సంబందించి ఆడియో, వీడియో రికార్డింగ్స్ ఉన్నట్లు స్పష్టమైంది. కానీ ఈలోగా నిందితులు ముగ్గురునీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లయితే టిఆర్ఎస్‌కు ఆశించిన రాజకీయ ప్రయోజనం కలుగకపోగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది.