
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డికి కేంద్ర ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. ఆయన ఓటర్లను భయపెడుతూ, ప్రలోభపెడుతున్నారని బిజెపి పిర్యాదుపై వెంటనే స్పందించిన కేంద్ర ఎన్నికల కమీషన్, ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు, వాటికి సంబందించిన ఆడియో రికార్డులు, మీడియాలో వచ్చిన వార్తలను పరిశీలించి ఈరోజు సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు మునుగోడులో అడుగుపెట్టవద్దని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని, మీడియాతో మాట్లాడరాదని, ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరాదని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని లేకుంటే ఎన్నికల నియమావళిని ఉల్లాఘించినందుకు చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది కూడా.
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తేనే సంక్షేమ పధకాలు వస్తాయని, బిజెపికి వేస్తే సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని బెదిరించారని రాష్ట్ర బిజెపి నేత కపిలవాయి దిలీప్ కుమార్ బుదవారం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. సంక్షేమ పధకాలు కావాలంటే టిఆర్ఎస్‌కు, వద్దనుకొంటే బిజెపికి ఓట్లు వేయాలని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పడం ఓటర్లను బెదిరించడం, ప్రలోభపెట్టడమే అని ఫిర్యాదు చేశారు. టిఆర్ఎస్‌కు ఓట్లు వేయకపోతే సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని బెదిరించడం ఎన్నికల నియామవళిని ఉల్లంఘించడమే అని ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కేంద్ర ఎన్నికల కమీషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ నుంచి నివేదిక తెప్పించుకొని పరిశీలించిన తర్వాత మంత్రి జగదీష్ రెడ్డిపై రెండు రోజులు నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఏ ఎన్నికలలో కూడా కేంద్ర ఎన్నికల కమీషన్ ఈవిదంగా జోక్యం చేసుకొన్న దాఖలాలు లేవు. కానీ తొలిసారిగా మునుగోడు ఉపఎన్నికలను చాలా నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు స్పందించి చర్యలు తీసుకొంటోంది. బిజెపి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ఎన్నికల కమీషన్ ఈవిదంగా వ్యవహరిస్తోందని టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.