పోలీసుల అత్యుత్సాహం... ఏసీబీ కోర్టు మొట్టికాయలు!

ఏ రాష్ట్రంలోనైనా అధికార యాంత్రాంగం మొత్తం ప్రభుత్వం, దానిని నడిపిస్తున్న అధికార పార్టీ కనుసన్నలలో పనిచేస్తాయని తెలిసిందే. తెలంగాణ పోలీసులు కూడా ఇందుకు మినహాయింపు కారు కనుక నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించి ఏసీబీ కోర్టులో మొట్టికాయలు తినాల్సివచ్చింది. 

ఈ వ్యవహారంలో నిందితులుగా పేర్కొన్న ముగ్గురికీ పోలీసులు 41 పీఆర్‌పీసీ ప్రకారం నోటీసులు జారీ చేయకుండానే కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కోరడంపై ఏసీబీ కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వారికి నోటీస్ ఇవ్వకుండా, విచారణ జరపకుండా జైలుకి పంపించాలని ఏవిదంగా కోరుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. పైగా నిందితుల వద్ద పట్టుబడిన రూ.15 కోట్ల నగదును పోలీసులు కోర్టుకు చూపనేలేదని కనుక వారికి రిమాండ్ విధించలేమని న్యాయమూర్తి స్పష్టం చేయడంతో ముగ్గురు నిందితులను విడిచిపెట్టక తప్పలేదు. అయితే మొయినాబాద్ పోలీసులు నిన్న సాయంత్రమే నోటీసులు తయారుచేసి వారికి అందజేసి ముగ్గురినీ 24 గంటలలోపు తమ ముందు విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశించారు. 

ఈ కేసులో వారిని పోలీసులు నిందితులుగా పేర్కొనందున అది నిరూపించాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. ఇప్పటికే ఈ వ్యవహారం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పైగా దీంతో బిజెపిని, మోడీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర బిజెపి నేతలు ‘ఇదంతా కేసీఆర్‌ ఆడించిన డ్రామా’ అని వాదిస్తున్నారు. ఈ వ్యవహారంతో కేసీఆర్‌కే సంబందం ఉంది తప్ప బిజెపికి లేదని, ఉంటే నిరూపించాలని అందుకోసం సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతున్నారు. 

కనుక పోలీసులపై రెండు వైపులా నుంచి మరింత ఒత్తిళ్ళు ఉంటాయని వేరే చెప్పక్కరలేదు. కనుక టిఆర్ఎస్‌, బిజెపి రాజకీయాలతో ముడిపడున్న ఈ వ్యవహారం ఎటు తిరిగి ఏవిదంగా సాగినా, ముగిసినా మద్యలో పోలీసులకు ఇటువంటి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. 

తాజా సమాచారం: ఈ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ మొయినాబాద్ పోలీసులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. మరి అక్కడా మరోసారి మొట్టికాయలు వేయించుకొంటారో లేదా హైకోర్టు వారికి రిమాండ్ విధిస్తుందో చూడాలి.