పాపం దానం నాగేందర్!

సమైక్య రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏలుతున్న సమయంలో అనేకమంది నేతలు ఒక వెలుగు వెలిగారు. వారిలో దానం నాగేందర్ కూడా ఒకరు. అలాగే 2014 ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత తెరాసవైపు చూస్తున్న వారిలో ఆయన కూడా ఒకరు. ఆయన గ్రేటర్ ఎన్నికలకి ముందే ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడుకొని తెరాసలో చేరేందుకు మూటాముల్లె సర్దుకొన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు బుజ్జగించడంతో తాత్కాలికంగా ఆ ఆలోచన వాయిదా వేసుకొన్నారు. వారి అభ్యర్ధన మేరకు ఆయన ఇంతవరకు తెరాసలో చేరలేదు కానీ అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో కూడా సమనదూరమే పాటిస్తున్నారు. హైదరాబాద్ నగర అధ్యక్షుడుగా ఉన్న ఆయన పార్టీకి ఎంతో కీలకమైన గ్రేటర్ ఎన్నికలలో పార్టీ మొహమే చూడలేదు. కనుక తెరాసలో చేరాలనే అయన ఆలోచన వాయిదా పడిందే తప్ప మారలేదని స్పష్టం అవుతోంది. 

కానీ తను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం నాగేందర్ చెప్పుకొన్నారు. ఆవిధంగా చెప్పుకోవలసిరావడమే పార్టీలో ఆయన పరిస్థితి ఏమిటో తెలియజేస్తోంది. తనకి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పదవులు, బాధ్యతలు అప్పగించనందునే పార్టీకి దూరంగా ఉండవలసివచ్చిందని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెరాస సర్కార్ తనని తాను నిరూపించుకోవడానికి ఓ ఆరు నెలల సమయమైన ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇంత కాలం మౌనం వహించాని, ఇకపై తెరాసని గట్టిగా డ్డీకొని తన సత్తా చూపుతానని చెప్పడం మరో విశేషం. తెరాస సర్కార్ వైఫల్యాలని ఎండగట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నానని చెప్పారు.               అయన ఏదో ఒకరోజు తెరాసలో చేరడం ఖాయంగా కనిపిస్తున్నప్పుడు మళ్ళీ దానిని డ్డీ కొనడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మభ్యపెట్టడానికేనని అనుమానించవలసి ఉంటుంది. ఆయన వంటి సీనియర్ నాయకుడు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని నిరూపించుకోవలసిరావడం చాలా చిత్రంగానే ఉంది. అంతకంటే ఆయన తెరాసలోకి వెళ్ళిపోతేనే ఆయనకి ఇంకా ఎక్కువ గౌరవంగా ఉండేది కదా?