
మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల హోరాహోరీ ప్రచారంతో నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులో నెలకొని ఉన్నాయి. టిఆర్ఎస్, బిజెపిలు మునుగోడు ఓటర్లకు అడిగిందల్లా తెచ్చి చేతిలో పెడుతున్నప్పటికీ వాటి ఒత్తిళ్ళు తట్టుకోలేక చాలా టెన్షన్ పడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో ప్రజాశాంతి అధ్యక్షుడు కెఏ పాల్ రంగప్రవేశం చేసి తన ఆటపాటలతో, పిట్టలదొర కబుర్లతో మునుగోడు ఓటర్లను చాలా ఉల్లాసపరుస్తున్నారు. సినిమాలో బ్రహ్మానందం ఎంత సీరియస్గా చెప్పినా జనం నవ్వుకొన్నట్లే, మునుగోడు ఎన్నికల ప్రచారంలో కెఏ పాల్ తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని, ఉద్యోగాల కల్పిస్తానని ఎంత సీరియస్గా చెప్పినా జనం లైట్ తీసుకొంటున్నారు. అయితే ఆట పాటలతో, పిట్టల దొర కబుర్లకు జనం సంతోషంతో చప్పట్లు కొడుతుంటే వారందరూ తనకే మద్దతు ఇస్తున్నారని కెఏ పాల్ భావిస్తూ మరింత రెచ్చిపోతూ మునుగోడు ప్రజలకు కావలసినంత వినోదం పంచుతున్నారు. ఇటీవల పోలీసులు ఆయన వాహనాన్ని ఆపినప్పుడు, ఆయన కోపంతో పోలీస్ అధికారి చొక్కా పట్టుకొని "నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలంగాణాకు కాబోయే ముఖ్యమంత్రినైన నా కారు ఆపుతావా?" అని గద్దించేసరికి వారికి కోపం రావలసింది హాయిగా నవ్వుకొన్నారు. మునుగోడు కురుక్షేత్రంలో ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే భరించడం చాలా కష్టం కదా?