
కోమటిరెడ్డి సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవం, ప్రాధాన్యం, పదవులు ఇస్తే అన్నదమ్ములిద్దరూ పార్టీని దారుణంగా దెబ్బ తీస్తున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోవడమే కాక మళ్ళీ బిజెపి అభ్యర్ధిగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అసలే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన రాజీనామాతో మరింత బలహీనపరచడమే కాకుండా, తప్పనిసరిగా ఉపఎన్నికలను కూడా ఎదుర్కోవలసిన పరిస్థితి తెచ్చిపెట్టారు.
ఇక ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మొదటి నుంచి ఈ ఉపఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఆయనను కలిసి చేతులు జోడించి తనకు మద్దతు ఈయవలసిందిగా కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్ధిస్తే, ఆమె నెత్తిన చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. కానీ ఈరోజు మునుగోడు కాంగ్రెస్‌లో తన అనుచరులకు స్వయంగా ఫోన్ చేస్తూ “తమ్ముడు బిజెపిలో ఉన్నాడని సందేహించవద్దు. పార్టీలు పట్టించుకోకుండా అతనికే ఓట్లు వేయండి. అతను గెలిస్తే రేవంత్ రెడ్డి పనైపోతుంది. అప్పుడు నేనే పిసిసి అధ్యక్షుడినవుతాను. తర్వాత రాష్ట్రమంతటా నేను పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అధికారంలో తెస్తాను,” అని చెప్పారు.
ఈ ఫోన్ సంభాషణ లీక్ అవడంతో సోషల్ మీడియాలోకి వచ్చేసి అక్కడా వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీని మోసం చేసినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైనే తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుండటంతో రగిలిపోతున్నారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను గద్దె దించడానికి కుట్ర జరుగుతోందని ఈరోజే ఆరోపించారు. ఆయన కొద్ది సేపటికే ఈ కుట్ర బయటపడటం, దాని కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెర వెనుక ఈవిదంగా పావులు కదుపుతున్నట్లు బయటపడింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆయనపై చర్యలు తీసుకొనే ధైర్యం చేస్తుందో లేదో చూడాలి.
కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ కోవర్ట్ రాజకీయాలు.#MunugodeBypoll pic.twitter.com/7lPznn6JGw