ఫ్లోరోసిస్ లేనప్పుడు సెంటర్ దేనికి? బూర ప్రశ్న

నిన్న ఢిల్లీలో బిజెపిలో చేరిన టిఆర్ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ ఈరోజు హైదరాబాద్‌ తిరిగివచ్చిన తర్వాత తొలిసారిగా బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు టిఆర్ఎస్‌ ఉద్యమపార్టీగానే ఉండేది కానీ ఎప్పుడైతే రాష్ట్రంలో టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆ పార్టీలో ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొని కేసీఆర్‌ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆనాడు ఉద్యమ సమయంలో కూడా ఇన్ని నిర్బంధాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు బయట తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

కేసీఆర్‌కి ఓట్లు, సీట్లు, డబ్బులే ముఖ్యం. సొంత ఎమ్మెల్యేలనే ఆయన బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. తన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో చాలా అభివృద్ధి సాధించిందని... మరే రాష్ట్రంలోని లేనన్ని సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నామని, రాష్ట్ర ప్రజలందరూ టిఆర్ఎస్‌వైపే ఉన్నారని గొప్పలు చెప్పుకొంటున్నప్పుడు ఎన్నికలలో ఒక్కో ఎమ్మెల్యే కనీసం రూ.2 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సివస్తోంది?

టిఆర్ఎస్‌ ఉద్యమ ద్రోహుల పార్టీగా మారినందునే ఈటల రాజేందర్‌, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నేను మా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం టిఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చేశాము. మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించడం ఖాయం. ఆ తర్వాత రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం కూడా ఖాయం.,” అని అన్నారు.

చౌటుప్పల్‌లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాధి కట్టడంపై స్పందిస్తూ, “ఉపఎన్నికల కోసం ఎంత నీచానికైనా టిఆర్ఎస్‌ దిగజారిపోతుందనడానికి ఇదే నిదర్శనం. అయినా మిషన్ భగీరధతో నల్గొండ జిల్లా నుంచి ఫ్లోరోసిస్ భూతాన్ని శాస్వితంగా తరిమికొట్టామని టిఆర్ఎస్‌ మంత్రులు గొప్పలు చెపుకొంటారు కదా? ఫ్లోరో సీస్ సమస్య లేనప్పుడు జిల్లాలో ఫ్లోరోసిస్ సెంటర్ ఎందుకు?” అని బూర నర్సయ్య గౌడ్‌ ప్రశ్నించారు.