137 సం.ల సుదీర్గ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఎన్నికయ్యారు. ఆయనతో శశి ధరూర్ అధ్యక్ష పదవికి పోటీ పడిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో మొత్తం 9,000 మంది సభ్యులు ఉండగా వారిలో 7,897 మంది ఖర్గెకు అనుకూలంగా, సుమారు 1,000 మంది మాత్రమే శశి ధరూర్‌కి అనుకూలంగా ఓట్లు వేశారు. దీంతో ఖర్గే సుమారు 6, 822 ఓట్ల భారీ మెజార్టీతో శశి ధరూర్‌పై ఘన విజయం సాధించారు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత గాంధీ కుటుంబానికి చెందని బయటివ్యక్తి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు.
సోనియాగాంధీ మద్దతు కలిగిన ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికవుతారని అందరూ ముందే ఊహించారు. ఆయన కూడా తాను పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ సోనియా, రాహుల్, ప్రియాంకలకు విధేయంగా ఉంటూ పార్టీని నడిపిస్తానని ముందే చెప్పడం ద్వారా, దేశవ్యాప్తంగా పార్టీలోని వారి విధేయులను తనవైపు తిప్పుకొన్నారు. గాంధీ కుటుంబానికి విధేయంగా ఉంటానని ఖర్గే చెప్పినందున, పార్టీ పగ్గాలు ఆయన చేతిలో ఉన్నట్లు పైకి కన్పిస్తున్నప్పటికీ ఇక ముందు కూడా అవి వారి చేతుల్లోనే ఉన్నట్లుగా భావించవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీలో కొత్త మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. కొత్త సీసాలో పాత సార పోసినట్లుగానే భావించవచ్చు.