ఆసిఫాబాద్ జిల్లాలోని అందవెల్లి పెద్దవాగుపై నిర్మించిన బ్రిడ్జి మంగళవారం అర్దరాత్రి కూలిపోయింది. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో పెద్దవాగుపై వంతెన కొద్దిగా పక్కకు ఒరిగినట్లు కొన్ని రోజుల క్రితమే గ్రామస్తులు గమనించి వెంటనే అధికారులను అప్రమత్తం చేయడంతో వారు వంతెనను మూసివేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నారు. గ్రామస్తులు భయపడుతున్నట్లే నిన్న అర్దరాత్రి వంతెన కూలిపోయింది.
కాగజ్ నగర్-దహెగాం మండలాలలోని 52 గ్రామాలను కలిపే ఈ వంతెన కూలిపోవడంతో వాటిమద్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెన కూలిపోవడంతో గ్రామస్తులు నాటు పడవలపై పెద్దవాగును దాటి అవతలివైపుకు చేరుకొంటున్నారు. తక్షణం కూలిపోయిన వంతెనను తొలగించి కొత్తది నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
అయితే ఈ వంతెన నిర్మించడానికే చాలా కాలం పట్టింది. కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన వంతెన కూలిపోయింది కనుక ఇప్పట్లో మరో కొత్త వంతెన నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికలలోగా మళ్ళీ పనులు మొదలైతే అది గొప్ప విషయంగానే భావించాల్సి ఉంటుంది. అప్పటికీ పనులు మొదలవకపోతే మరో రెండు మూడేళ్ళు గ్రామస్తులు తిప్పలు పడకతప్పదు.