అయ్యో కేటీఆర్‌ ఏంటి... ఇలా అడ్డంగా దొరికిపోయారు?

మంత్రి కేటీఆర్‌ చాలా ఆచితూచి మాట్లాడుతారని అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి మునుగోడు ఉపఎన్నికలలో తమ పార్టీ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించేందుకు సహకరించాల్సిందిగా బిజెపి సీనియర్ నేత జగన్నాధంకు ఫోన్‌ చేశారంటే నమ్మగలమా? కానీ అదే జరిగింది. 

ఈరోజు జగన్నాధంకు కేటీఆర్‌ ఫోన్‌ చేసి, “ఈ ఉపఎన్నికలలో బిజెపి గెలిస్తే రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చేదీ లేదు. మా ప్రభుత్వం పోయేదీ లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి నాకంటే మీకే బాగా తెలుసు. ఆయన ఏనాడూ నియోజకవర్గాన్ని పట్టించుకొన్నది లేదు. పోనీ  అతనేమైనా ఆర్ఎస్ఎస్‌లోనో లేదా బిజెపిలో ఎప్పటినుంచో ఉన్నవాడు కూడా కాడు. మీరు ఈ ఉపఎన్నికలలో మాకు కాస్త సహకరిస్తే గట్టుప్పల్‌ని అన్నివిధాలుగా కలిసి అభివృద్ధి చేసుకొందాం. మీకు నియోజకవర్గంలో మంచి ఇన్ఫ్లూయెన్స్ ఉందని, మీరు సహకరిస్తే సులువుగా గెలవవచ్చని మా వాళ్ళు నాకు చెపితే నేను మీకు ఫోన్‌ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. 

మీ నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు, 43 వేలమందికి పెన్షన్లు వస్తున్నాయి. మేము పనులు చేసే మీ సహకారం అడుగుతున్నాము తప్ప ఏదో డొల్ల మాటలు చెప్పి మాట్లాడటం లేదు,” అని చెప్పినప్పుడు జగన్నాధం కలుగజేసుకొని రైతు బంధు బాగా డబ్బున్న భూస్వాములకే ఇస్తున్నారు తప్ప నిజంగా ఆ సాయం అవసరమున్న కౌలు రైతులకు ఇవ్వడం లేదు మీ ప్రభుత్వం,” అని అన్నారు. 

కౌలురైతులకు రైతు బంధు ఇవ్వడంలో ఉండే ఇబ్బందుల గురించి ఇదివరకు సిఎం కేసీఆర్‌ చెప్పిన మాటలనే మంత్రి కేటీఆర్‌ కూడా చెప్పారు.

కేటీఆర్‌ జగన్నాధంతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు అక్కడే మీడియా ప్రతినిధులు ఉండటంతో ఆయన స్పీకర్ ఆన్‌ చేసి తమ సంభాషణను వారికి కూడా వినిపించడంతో ఈ విషయం మీడియాకు అక్కడి నుంచి సోషల్ మీడియాకు వ్యాపించి ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

ఇది బిజెపి మైండ్ గేమ్ కూడా అయ్యుండవచ్చు కాకుంటే బిజెపి నేతకు ఫోన్‌ చేసి కేటీఆర్‌ అడ్డంగా దొరికిపోయినట్లు భావించవచ్చు. ఇప్పుడు దీనిపై కేటీఆర్‌, టిఆర్ఎస్‌ నేతలు ఏవిదంగా స్పందిస్తారో, రాష్ట్ర బిజెపి నేతలు, కాంగ్రెస్‌ నేతలు ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.