మునుగోడులో కోటి రూపాయలు స్వాధీనం

మునుగోడు ఉపఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలుపు కోసం ఎంత డబ్బు ఖర్చు చేసేందుకైనా వెనకాడటం లేదు. కనుక మునుగోడు నియోజకవర్గానికి వెళ్ళే అన్ని మార్గాలలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనికీలు చేస్తున్నారు. సోమవారం మండలంలోని చల్మెడ చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనికీలు చేస్తుండగా, కరీంనగర్‌ జిల్లా బిజెపి కౌన్సిలర్ భర్తకు చెందిన ఓ కారులో కోటి రూపాయలు నగదు పట్టుబడింది. పోలీసులు నగదును, కారును స్వాధీనం చేసుకొని ఆ నగదును తీసుకువెలుతున్నవారిని అదుపులోకి తీసుకొన్నారు. అది బిజెపి కౌన్సిలర్ కారు కనుక మునుగోడు బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసమే తరలిస్తున్నట్లు అర్దమవుతూనే ఉంది.

ఇది ధర్మ యుద్ధం... మునుగోడు ప్రజలందరూ తనవైపే ఉన్నారని చెప్పుకొంటున్న రాజగోపాల్ రెడ్డి, ఓటర్లకు ఏ స్థాయిలో డబ్బు పంచిపెడుతున్నారో దీంతో అర్దం అవుతుంది. అయితే టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కూడా ఇందుకు మినహాయింపు కావనే చెప్పాలి. ఎంతచెట్టుకి అంత గాలి అన్నట్లు ఏ పార్టీ, అభ్యర్ధి శక్తిసామర్ధ్యాలను బట్టి డబ్బు పంచుపెడుతాయి. అంతే!  

నవంబర్‌3వ తేదీన పోలింగ్ జరుగబోతోంది. అంటే ఉపఎన్నికలకు మరో 15  రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కనుక పార్టీ నేతల మద్య మాటల యుద్ధాలు, ఈ ప్రలోభాలు రాబోయే 15 రోజులలో మరింత ఉదృతంగా ఉండవచ్చు. నవంబర్‌ 6వ తేదీన ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు.