137 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సోనియా, రాహుల్, ప్రియాంకా ముగ్గురూ నిరాకరించడంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశి థరూర్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వారిద్దరిలో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని తేల్చేందుకు నేడు ఎన్నిక జరగబోతోంది. దేశవ్యాప్తంగా పార్టీలో ఓటు హక్కు కలిగిన ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు9,300 మంది ఉన్నారు. వారందరూ వారి వారి రాష్ట్రాలలో నేడు జరిగే పోలింగులో రహస్య బ్యాలెట్ ద్వారా తమ కొత్త అధ్యక్షుడుని ఎన్నుకొంటారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 238 మంది సభ్యులున్నారు. ఈరోజు పోలింగ్ ముగిసినప్పటికీ ఎల్లుండి బుదవారం ఓట్లు లెక్కించి వారిద్దరిలో ఎవరు కాంగ్రెస్ అధ్యక్షులో ప్రకటిస్తారు.
వారిద్దరిలో ఖర్గేకు సోనియా గాంధీ మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ తాను అధ్యక్షుడుగా ఎన్నికైతే తాను సోనియా, రాహుల్, ప్రియాంకల సలహాలు, సూచనలు స్వీకరించడానికి మొహమాటపడనని చెప్పడం ద్వారా దేశవ్యాప్తంగా సోనియా కుటుంబం విధేయులకు బలమైన సందేశమే పంపారు. బ్యాలెట్ పేపర్లో ఆయన పేరే పైనుంది. కనుక తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలోని ఆమె విధేయులు అందరూ మల్లిఖార్జున ఖర్గేకే ఓట్లు వేయడం ఖాయం. ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ముందే చెప్పినట్లు సోనియా, రాహుల్, ప్రియాంకల కనుసన్నలలో పనిచేయడం కూడా ఖాయమే కనుక కాంగ్రెస్ పగ్గాలు గాంధీ కుటుంబం చేతిలోనే ఉంటాయని భావించవచ్చు.