తెరాస ఎమ్మెల్యేకి హైకోర్టులో చుక్కెదురు

తెరాస ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం జిల్లాలో  ఆయనకి చెందిన మమతా మెడికల్ కాలేజీ పక్కన సుమారు 2.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొన్నారని, ఆయన అధికార పార్టీకే చెందినవారు కావడంతో ప్రభుత్వం దానిని క్రమబద్దీకరించిందని, దానిలో ఇప్పుడు అయన మెడికల్ కాలేజీ భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ సుధాకర్ రావు అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిని ఈరోజు విచారణకి చేపట్టిన హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆ భూమిలో ఎటువంటి నిర్మాణపనులు చేపట్టకూడదని అజయ్ కుమార్ ని ఆదేశించింది. దానిపై 3 వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని తెరాస సర్కార్ కి కూడా నోటీసులు జారీ చేసింది. 

హైకోర్టు ఆదేశాలపై అజయ్ కుమార్ స్పందిస్తూ “నన్ను రాజకీయంగా ఎదుర్కోలేని వ్యక్తులే నాపై ఈవిధంగా బురద జల్లుతున్నారని తెలుసు. నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదు. కాలేజి పక్కన ఉన్న స్థలాన్ని జి.ఓ.నెంబర్: 59 ప్రకారం రూ.2.10 కోట్లు చెల్లించి క్రమబద్దీకరించుకొన్నాను. అక్కడ ఎటువంటి చెరువు, సరస్సు లేదు. వారు నాపై దురుదేశ్యంతోనే ఈ కేసు వేసినప్పటికీ దాని వలన నాకే మేలు జరుగుతుందని నమ్ముతున్నాను. ఆ భూమి ఎవరిదో న్యాయస్థానమే తేల్చి చెపుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే నా పదవికి రాజీనామా చేయడానికి కూడా నేను సిద్దమే,” అని అన్నారు. 

పిటిషనర్ కోర్టుకి ఏమి చెప్పారో అజయ్ కుమార్ కూడా అదే చెపుతున్నట్లు స్పష్టం అవుతోంది. కనుక ఆయనని ఇప్పుడు ప్రభుత్వమే కాపాడవలసి ఉంటుంది. అక్కడ ఎటువంటి చెరువులు లేవని, అది ప్రభుత్వ భూమి కాదని చెప్పితేనే ఈ కేసు నుంచి ఆయన నిర్దోషిగా బయటపడగలరు లేకుంటే చాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.