ఇదేంది గద్దరన్నా... పాల్‌కి గిట్ల షాకిచ్చినవ్?

వారం రోజుల క్రితమే ప్రజాశాంతి పార్టీలో చేరిన ప్రజా గాయకుడు గద్దర్ తన పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కి ఊహించని షాక్ ఇచ్చారు. కేఏ పాల్‌ ఆయనను మునుగోడు అభ్యర్ధిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజైన నిన్న ఆయన తన నామినేషన్‌ వేయకుండా మొహం చాటేసి కేఏ పాల్‌కి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ విషయం ఆయన ముందుగానే చెప్పారో లేక కేఏ పాల్‌ గ్రహించారో తెలీదు కానీ కేఏ పాల్‌ స్వయంగా నిన్న నామినేషన్‌ వేశారు. అంటే గద్దర్ బదులు ఆయనే ఈ ఉపఎన్నికలలో పోటీ చేయబోతున్నారన్న మాట! 

ఇంతకీ గద్దర్ ఎందుకు మొహం చాటేశారు? కేఏ పాల్‌కి ఎందుకు హ్యాండిచ్చారు?అంటే హటాత్తుగా ఆయన ఆరోగ్యం పాడవడంతో హాస్పిటల్‌లో చేరారని, ఆయన పోటీ చేయవద్దని టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్, తెజస పార్టీలు ఒత్తిడి చేశాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

కేఏ పాల్‌ నిన్న నామినేషన్‌ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “గద్దరన్న మా పార్టీ తరపున పోటీ చేస్తున్నారని తెలియగానే టిఆర్ఎస్‌, బిజెపిలు భయంతో వణికిపోయాయి. దాంతో ఆయనను బెదిరించి నామినేషన్‌ వేయకుండా అడ్డుకొన్నాయి. అందువల్లే నేనే నామినేషన్‌ వేశాను. నేను మునుగోడు ఉపఎన్నికలలో పోటీ చేస్తున్నానని తెలియగానే పలువురు ఇండిపెండేట్ అభ్యర్ధులు నాకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్దమయ్యారు. నన్ను గెలిపిస్తే నేను మునుగోడుని అభివృద్ధి చేసి చూపిస్తాను. కనుక మునుగోడు ప్రజలందరూ దయచేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను,” అని కేఏ పాల్‌ అన్నారు.