నేడు నామినేషన్‌ వేయనున్న కూసుకుంట్ల

మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్‌ వేయబోతున్నారు. చండూరు మండలంలోని బంగారిగెడ్డ నుంచి చండూరు పట్టణం వరకు భారీ ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్‌ వేయబోతున్నారు. ఆయనకు మద్దతుగా మంత్రులు కేటీఆర్‌, జగదీష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టిఆర్ఎస్‌ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. నామినేషన్‌ వేసిన తర్వాత మంత్రి కేటీఆర్‌ మునుగోడు ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించనున్నారు. 

మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా ప్రజాగాయకుడు గద్దర్, బీఎస్పీ అభ్యర్ధిగా ఆందోజు శంకరాచారి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేసేందుకు గద్దర్ అంగీకరిస్తే తెలంగాణ జనసమితి మద్దతు ఇస్తుందని లేకుంటే తమ అభ్యర్ధిని బరిలో దింపుతామని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మూడు రోజుల క్రితం చెప్పారు. 

మునుగోడు ఉపఎన్నికలలో పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌, బిజెపిల మద్యే ఉంటుందని అందరికీ తెలుసు. మిగిలిన పార్టీలన్నీ టిఆర్ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే పరిమితం కావచ్చు. కనుక వాటి వలన టిఆర్ఎస్‌ లాభపడి బిజెపి నష్టపోయే అవకాశం ఉంటుంది.