19.jpg)
చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న తెలంగాణ జనసమితి (టిజేఎస్) అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ఈరోజు నాంపల్లిలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికలలో తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని చెప్పారు. త్వరలోనే అభ్యర్ధిని ప్రకటిస్తామని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ తరపున పోటీచేస్తున్న ప్రజా గాయకుడు గద్దర్ ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేయదలిస్తే తాము అభ్యర్ధిని దింపకుండా ఆయనకు మద్దతు ఇస్తామని ప్రొ.కోదండరామ్ అన్నారు.
సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తుండటంపై ప్రొ.కోదండరామ్ స్పందిస్తూ, “కేసీఆర్ ఎప్పుడూ తక్షణ రాజకీయ అవసరాల కోసమే ఆలోచిస్తారు తప్ప దీర్గకాలిక ప్రయోజనాలను పట్టించుకోరు. పండిత్ జవహార్ లాల్ నెహ్రూ, డాక్టర్ అంబేడ్కర్ వంటివారికి సిద్దాంతాలు ఉన్నందునే ఆనాడు వారు ఓ ఆర్ధిక నమూనాను రూపొందించారు. ఆ ఆర్ధిక పునాదులపైనే దేశం నిలబడింది. కానీ సిఎం కేసీఆర్కు అటువంటి సిద్దాంతాలు లేవు... విధానాలు కూడా లేవు. రాజకీయాలతో పదవులు, అధికారం, డబ్బు సంపాదించుకోవడమే లక్ష్యంగా ఆయన పాలన సాగుతోంది. కేసీఆర్ కుటుంబ కేవలం తెలంగాణ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నట్లయితే వారి కుటుంబానికి ఇన్ని వేలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?తెలంగాణ మోడల్ అభివృద్ధి అంటూ కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెపుతున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ నగరాలలో మేము సదస్సులు నిర్వహించి తెలంగాణ అభివృద్ధిలో డొల్లతనాన్ని బయటపెడతాము,” అని హెచ్చరించారు.