కూసుకుంట్లకే మునుగోడు టికెట్‌

మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా ఎవరిని నిలపాలనే దానిపై సిఎం కేసీఆర్‌ అనేక సర్వేలు చేయించిన తర్వాత చివరికి ముందే అనుకొన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును నేడు ఖరారు చేశారు. నేటి నుంచి మునుగోడు ఉపఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ ప్రారంభమై 14వరకు సాగుతుంది. కనుక ఆలోగా ఆయన నామినేషన్ వేయనున్నారు. 

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2014 ఎన్నికలలో మునుగోడు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ 2018 ముందస్తు ఎన్నికలలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన మునుగోడు నియోజకవర్గానికి టిఆర్ఎస్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ నిత్యం ప్రజల మద్య ఉంటునందున ఆయనకే సిఎం కేసీఆర్‌ మొగ్గుచూపారు. 

ఇప్పటికే కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, బిజెపి తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా ప్రజాగాయకుడు గద్దర్ బరిలో ఉన్నారు. ఈ ఉపఎన్నికలలో బీఎస్పీ కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ ప్రకటించారు. కనుక బీఎస్పీ కూడా తన అభ్యర్ధిని ప్రకటిస్తే వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ వంటి ఈ ఉపఎన్నికలలో అభ్యర్ధులు అందరూ సమరానికి సిద్దం అయినట్లే.

మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్: 

నామినేషన్లు: అక్టోబర్‌ 14వరకు 

ఉపసంహరణ: అక్టోబర్‌ 17వరకు

పోలింగ్: నవంబర్‌ 3వ తేదీ

ఫలితాల ప్రకటన: నవంబర్‌ 6వ తేదీ.