ముందు తెలంగాణలో గెలిచి చూపించు: బండి సంజయ్‌ సవాల్

టిఆర్ఎస్‌ పార్టీని బిఆర్ఎస్‌ పార్టీగా పేరు మార్చి దాంతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. బిఆర్ఎస్‌ ఏర్పాటుపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందిస్తూ, “ప్రజలు టిఆర్ఎస్‌ను నమ్మి ఓట్లేస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ పార్టీ పేరునే మార్చేశారు. దాంతో జాతీయ రాజకీయాలలో ఏదో చేసేస్తానంటూ బయలుదేరుతున్నారు. నిజంగా మీకు అంత దమ్ముంటే ముందు మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి బిఆర్ఎస్‌ పార్టీతో తెలంగాణలో మళ్ళీ నెగ్గిచూపించాలని నేను కేసీఆర్‌ను సవాలు చేస్తున్నాను. కేసీఆర్‌ తన కుమారుడు కేటీఆర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ నుంచి తన బిడ్డ కల్వకుంట్ల కవితను బయటపడేసేందుకే బిఆర్ఎస్‌ పేరుతో ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారని మేము భావిస్తున్నాము. అయితే బర్రెకు సున్నం పూస్తే ఆవు కానట్లే టిఆర్ఎస్‌ పేరును బిఆర్ఎస్‌గా మారిస్తే జాతీయపార్టీ అయిపోదు.   ప్రజలను మోసగించే కంపెనీలు పాత బోర్డు తీసేసి కొత్త బోర్డు తగిలించినట్లుంది ఈ పేరు మార్పిడి వ్యవహారం.

ఈ ఎనిమిదేళ్ళలో వేలకోట్లు అక్రమంగా సంపాదించిన డబ్బు చేతిలో ఉంది కనుకనే వంద కోట్లు పెట్టి విమానం కొనుకొంటున్నారు. జాతీయపార్టీ పెట్టగలుగుతున్నారు. ముందు టిఆర్ఎస్‌ అన్నారు ఇప్పుడు బిఆర్ఎస్‌ అంటున్నారు రేపు పిఆర్ఎస్‌ (ప్రపంచ రాజ్యసమితి) అంటారేమో కూడా? టిఆర్ఎస్‌, బిఆర్ఎస్‌, కేసీఆర్‌ కధ మునుగోడు ఉపఎన్నికలతోనే ముగియబోతోంది,” అని బండి సంజయ్‌ అన్నారు.