ఇప్పుడా కోదండరాం అభ్యంతరాలు?

తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిన్న జేఏసి ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకి ఒక వినతి పత్రం ఇచ్చారు. జిల్లాల పునర్విభజనలో కొన్ని గ్రామాలని, మండలాలను పొరుగు జిల్లాలలో విలీనం చేయడంపై ప్రజలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని, ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేయాలని వినతి పత్రంలో కోరారు. రాష్ట్రంలో నేటికీ అనేక చోట్ల ప్రజలు ప్రభుత్వం నిర్ణయంపై నిరసనలు తెలియజేస్తూ ఆందోళనలు చేస్తున్నారని రాజీవ్ శర్మకి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో మనస్తాపం చెంది ఇద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారని తెలిపారు.

ముసాయిదా తీర్మానంలో ఒక విధంగా ప్రకటించి, రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గి చివరి నిమిషంలో చాలా మార్పులు చేయడాన్ని ప్రొఫెసర్ కోదండరాం తప్పు పట్టారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరుగలేదని అభిప్రాయపడ్డారు. జిల్లాలు, మండలాలు, డివిజన్ల ఏర్పాటు కోసం ప్రజలు ఆందోళన చేయవలసిన పరిస్థితి రావడమే దురదృష్టమనుకొంటే వారిపై పోలీసులు కేసులు బనాయించి వేదిస్తుండటం ఇంకా తప్పని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తక్షణమే వారిపై కేసులు ఎత్తివేసి, అధికారులు వారితో సమావేశమయ్యి వారి అభిప్రాయలు తీసుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తనకి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు కనుకనే ప్రభుత్వ కార్యదర్శిని కలిసినట్లు ప్రొఫెసర్ కోదండరాం చెప్పకనే చెప్పారు.