
“నేను ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో తరచూ మాట్లాడుతుంటాను. నా దగ్గర లక్షల కోట్లున్నాయి... కేసీఆర్, చంద్రబాబు నాయుడులకు ఎన్నికలలో ఆర్ధికసాయం చేశాను…” అంటూ చెప్పుకొనే కేఏపాల్ రాజకీయాలలోకి దిగి రాణించాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు ఆయనను ఓ రాజకీయ కమెడియన్‌గా మాత్రమే చూస్తూ ఆయన మాటలను వినోదంగా తీసుకొని ఆస్వాదిస్తున్నారే తప్ప అందరి ఆశీర్వదించే ఆయనను ఎవరూ ఆశీర్వదించడం లేదు. తన పార్టీని ఏ రాష్ట్రం గెలిపిస్తే ఆ రాష్ట్రానికి లక్ష కోట్లు ఇస్తానని కేఏపాల్ బంపర్ ఆఫర్ ఇచ్చినా ఎవరూ ఆయన మాటలను నమ్మడం లేదు. అయితే ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ మాత్రం ఆయన మాటలని నమ్మినట్లున్నారు. ఆయన నిన్న ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడమే కాకుండా నవంబర్ 3వ తేదీన జరుగబోయే మునుగోడు ఉపఎన్నికలలో తమ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని ప్రకటించారు. నేటి నుంచే మునుగోడులో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని గద్దర్ ప్రకటించారు.
మునుగోడు ఉపఎన్నికల బిఆర్ఎస్గా మారిన టిఆర్ఎస్, బిజెపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీచేస్తున్నాయి. ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ ఉపఎన్నికలో బీఎస్పీ కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదివరకే ప్రకటించారు. కనుక తన వద్ద లక్షల కోట్లు ఉన్నాయని చెపుతున్న కేఏ పాల్, తనపై నమ్మకంతో మునుగోడు బరిలో దిగుతున్న గద్దర్ని గెలిపించుకొనేందుకు ఎన్ని వందల కోట్లు ఖర్చుచేస్తారో చూడాలి.