బిఆర్ఎస్‌గా మారిన టిఆర్ఎస్‌: కేసీఆర్‌ ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి తొలి అడుగువేశారు. టిఆర్ఎస్‌ పార్టీని భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్‌)గా మార్చే తీర్మానానికి టిఆర్ఎస్‌ పార్టీలో 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సిఎం కేసీఆర్‌ ఈరోజు ప్రకటించారు. సిఎం కేసీఆర్‌ ఆ తీర్మానాన్ని చదివి వినిపించగానే బిఆర్ఎస్‌ సభ్యులుగా మారబోతున్న టిఆర్ఎస్‌ నేతలందరూ చప్పట్లతో హర్షధ్వానాలు తెలియజేశారు.

ముందుగా ప్రకటించినట్లు మధ్యాహ్నం 1.19 గంటలకు సిఎం కేసీఆర్‌ తీర్మానం మీద, పార్టీ పేరు మార్పు కోసం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పంపబోయే దరఖాస్తు మీద సంతకాలు చేశారు. మరికొద్ది సేపటిలో సిఎం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌ నుంచి ప్రగతి భవన్‌కు బయలుదేరి వెళతారు. అక్కడ టిఆర్ఎస్‌ ముఖ్య నేతలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులతో భోజనం చేసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌మీట్‌ పెట్టి పార్టీ ఆశయాలు, లక్ష్యాలు, కార్యాచరణ గురించి వివరిస్తారు. ప్రెస్‌మీట్‌లో మునుగోడు ఉపఎన్నికలకు టిఆర్ఎస్‌ అభ్యర్ధి పేరును కూడా ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ భవన్‌ బయట టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు పటాసులు పేల్చి, కేకులు కట్ చేస్తూ సంబురాలు చేసుకొంటున్నారు. కేసీఆర్‌ బిఆర్ఎస్‌ను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా హైదరాబాద్‌ నగరంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో సిఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. ఇది పెద్ద విశేషమేమీ కాదు కానీ అప్పుడే విజయవాడలో కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి.


టిఆర్ఎస్‌ ముఖ్యనేతలు రేపు గురువారం కేసీఆర్‌ సంతకం చేసిన దరఖాస్తును ఢిల్లీలో ఎన్నికల కమీషనర్‌కు అందజేస్తారు. దానిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరుతూ ఎన్నికల కమీషన్‌ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. నెలరోజులలోగా ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అప్పటి నుంచి బిఆర్ఎస్‌ పార్టీకి గుర్తింపు పొంది టిఆర్ఎస్‌ బిఆర్ఎస్‌గా పనిచేయడం ప్రారంభిస్తుంది. డిసెంబర్‌లో ఢిల్లీలో, సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లేదా గుంటూరు బిఆర్ఎస్‌ బహిరంగసభలు నిర్వహించబోతోంది.