1.jpg)
నేడు వరంగల్‌లో పర్యటించిన సిఎం కేసీఆర్ తొలిసారిగా సరికొత్త నినాదం చేశారు. ఎప్పుడూ జై తెలంగాణ అంటూ సభలు, సమావేశాలు ముగించే కేసీఆర్ తొలిసారిగా నేడు జై భారత్... జై తెలంగాణ అంటూ నినాదం చేయడంతో ప్రజలు కూడా ఉత్సాహంగా గొంతు కలుపుతూ నినాదాలు చేశారు. అక్టోబర్ 5వ తేదీన సిఎం కేసీఆర్ తన జాతీయపార్టీ పేరును ప్రకటించబోతున్నారు. దాంతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతున్నారు కనుక జై భారత్... జై తెలంగాణ అనే కొత్త నినాదం చేసినట్లు స్పష్టం అవుతోంది.
ఈరోజు వరంగల్ పర్యటనలో కేసీఆర్‌కు వీఆర్ఏల నిరసన సెగలు తగిలాయి. ఆయన కాన్వాయ్ జనగామలో సాగుతున్నప్పుడు రోడ్డు పక్కన వారు ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలుపుతుండటం చూసి సిఎం కేసీఆర్ తన కాన్వాయ్‌ని ఆపించి కారులో నుంచి దిగి వారితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకొని వినతిపత్రం తీసుకోవడంతో వారు చాలా సంతోషించారు.
కానీ సిఎం కేసీఆర్ హనుమకొండలో మాజీ ఎంపీ, టిఆర్ఎస్ నేత కెప్టెన్ రామారావు ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ కూడా వీఆర్ఏ నేతలు వచ్చి ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కానీ సిఎం కేసీఆర్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినతి పత్రాన్ని విసిరేసి, మీకేమి పనీపాటా లేదా నా దగ్గర డ్రామాలు ఆడుతున్నారంటూ వారిపై ఫైర్ అయ్యారు. దాంతో వీఆర్ఏ నేతలు షాక్ అయ్యారు. సిఎం కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది వారిని అక్కడి నుంచి పంపించేశారు.