అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసినందుకు భలే శిక్ష

రాజస్థాన్‌ సిఎం అశోక్ గెహ్లోత్‌ అతితెలివి ప్రదర్శించబోయి బోర్లాపడ్డారు. ఆయన కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. అయితే ఒక వ్యక్తికి ఒక పదవి మాత్రమే అని రాహుల్ గాంధీ చేసిన సూచనతో రెండు పదవులు వదులుకోవడానికి ఇష్టపడని ఆయన తన ఎమ్మెల్యేల చేత తిరుగుబాటు చేయించారు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని లేకుంటే ఆయన సూచించిన తమలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే రాజీనామాలు చేస్తామని బెదిరించారు. 

అశోక్ గెహ్లోత్‌ అతితెలివిని కాంగ్రెస్‌ అధిష్టానం పసిగట్టడంతో ఆయనను అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించేసింది. తమను ఈవిదంగా బ్లాక్ మెయిల్ చేయించినందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తప్పించేసేందుకు సిద్దం అవుతోంది. దీంతో అశోక్ గెహ్లోత్‌ రెండు పదవులూ పోగొట్టుకోబోతుండటంతో గగ్గోలు పెడుతున్నారు.

తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటన చేశారు. కానీ కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్లు కాంగ్రెస్‌ అధిష్టానం ధీటుగా స్పందించింది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో ఒకటి రెండు రోజులలో సోనియా గాంధీ నిర్ణయం తీసుకొంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. అయినా పదవుల కోసం సొంత ప్రభుత్వాన్నే కూల్చుకొని పార్టీని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ఆయన ఎలా అనుకొన్నారో?