ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో 10 అంతస్తుల నూతన సచివాలయ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించుకోవడంతో ప్రస్తుతం సచివాలయంలో ఉన్న కార్యాలయాలు తరలింపు అనివార్యమైంది. అధికారులు వాటి కోసం ఆరు భవనాలని గుర్తించారు. సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయం, మరికొన్ని ముఖ్యమైన శాఖల కార్యాలయాలని సమీపంలోనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ లోకి తరలించాలని నిర్ణయించారు. మిగిలిన కార్యాలయాలని నగరంలోనే ఉన్న సంబంధిత కార్యాలయాలలోకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలని బి.ఆర్.కె. భవన్ లోకి తరలించాలని నిర్ణయించారు. ఏఏ కార్యాలయాలని ఎక్కడికి తరలిస్తే పనికి ఆటకం కలగకుండా సజావుగా సాగుతుందో అధికారులు పరిశీలిస్తున్నారు.
సచివాలయంలోని కొన్ని బ్లాకులలో ఇంకా ఆంధ్రాకి చెందిన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నందున వాటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసి ఉంది. కనుక వాటి కోసం కేటాయించిన భవనాలలోకి వాటిని తరలించవలసిందిగా ఏపి సిఎం చంద్రబాబుని కోరవలసిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్ నరసింహన్ కి నిన్న విజ్ఞప్తి చేశారు.
వచ్చే నెలలోగానే సచివాలయాన్ని కూల్చివేసి కొత్త భవనానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శంఖుస్థాపన చేయాలనుకొంటున్నారు కనుక సచివాలయంలోని ప్రభుత్వ కార్యాలయాలు యుద్ద ప్రాతిపదికన వాటికి కేటాయించిన వేరే భవనాలలోకి తరలించవలసి ఉంటుంది.
రాష్ట్రం విడిపోయినందున ఆంధ్రా ప్రభుత్వం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మించుకొని అక్కడికి తరలివెళ్ళడం సహజంగానే ఉంది. కానీ ఉన్న సచివాలయాన్ని కూల్చికొంటునందున దానిలోని తెలంగాణా ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూట ముల్లె సర్దుకొని వేరే చోటికి తరలివెళ్ళవలసి రావడం చిత్రంగానే ఉంది.