మునుగోడులో బీఎస్పీ కూడా పోటీ

మునుగోడు ఉపఎన్నికల బరిలో బహుజన్ సమాజ్ పార్టీ కూడా బరిలో దిగబోతోందని ఆ పార్టీ కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ మంగళవారం ప్రకటించారు. నిన్న మునుగోడులో జరిగిన బహుజన రాజ్యాధికార యాత్రలో పాల్గొన్న ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు. “మునుగోడులో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో నుంచి 12సార్లు అగ్రకులాలవారే పోటీ చేశారు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు. ఈసారి కూడా మూడు పార్టీలు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారినే అభ్యర్ధులుగా నిలబెడుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కనుక ఈసారి మునుగోడు ఉపఎన్నికలలో బీఎస్పీ తరపున బడుగు బలహీనవర్గాలకు చెందిన అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకొందాము. మునుగోడులో మన జెండా ఎగురవేసి మన సత్తా చాటుకొందాము. రాజ్యాధికారం లేకుండా మన బ్రతుకులు ఎన్నటికీ బాగుపడవు. కనుక వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అన్ని స్థానాలలో బీఎస్పీ పోటీ చేస్తుంది,” అని ప్రవీణ్ కుమార్‌ ప్రకటించారు. 

కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, “1300 మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయిపోయింది. ఓ పక్క రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతుంటే కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు మాత్రం ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకి పెరిగిపోతున్నాయి. కేసీఆర్‌ కుటుంబం కోసమేనా మనం తెలంగాణ సాధించుకొన్నది? కేసీఆర్‌ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం. మన బతుకులు బాగుచేసుకొందాం,” అని అన్నారు.