3 రోజుల్లో 300 కోట్లు విడుదలకి సర్కార్ ఓకె!

మూడు రోజుల్లో రూ.300 కోట్లు...ఈ నెలాఖరులోగానే మరో రూ.300 కోట్లు విడుదల చేయబోతోంది తెరాస సర్కార్! అంటే 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.600 కోట్లు విడుదల చేయబోతోందన్న మాట! ఇంతకీ దేనికి అంటే, రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలకి అది చెల్లించవలసిన భోదనా రుసుము బకాయిలు. 

తమ బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ కళాశాలల యాజమన్యాలు చాలా రోజులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెకి దిగి పరీక్షలు నిర్వహించబోమని మొండికేసాయి. అప్పుడు గానీ తెరాస సర్కార్ దిగిరాలేదు. ఆ బకాయిల చెల్లింపులపై రెండు రోజులుగా విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి వారితో చర్చిస్తున్నారు. చివరికి ఇవ్వాళ్ళ వారి మధ్య రాజీ కుదిరింది. మంత్రి ఇచ్చిన హామీతో తృప్తి చెందిన కళాశాలల యాజమన్యాలు సమ్మె విరమించి, ఈనెల 24 నుంచి జరుగవలసిన పరీక్షలు యధాప్రకారం నిర్వహిస్తామని చెప్పారు. తాము కాలేజీలో లెక్చరర్లకి ఉద్యోగులకి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నందునే బకాయిల చెల్లింపు కోసం ఇంతగా పట్టు పట్టవలసి వచ్చిందని కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు చెప్పారు. 

ప్రభుత్వానికి, వారికి మధ్య రాజీ కుదరడం హర్షణీయమే కానీ మళ్ళీ ఇక్కడ కూడా అదే సందేహం తలెత్తుతుంది. తెలంగాణా ధనిక రాష్ట్రమని, ఆర్ధికంగా చాలా బలంగా ఉందని ప్రభుత్వమే చెప్పుకొంటున్నప్పుడు ప్రైవేట్ కళాశాలల యాజమన్యాలకి ఇన్ని రోజులుగా బకాయిలు ఎందుకు చెల్లించలేదు? అదేవిధంగా ఇంతకాలం డబ్బు లేదని చెపుతున్న ప్రభుత్వం వారు గట్టిగా పట్టుపట్టగానే కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.600 కోట్లు ఎలాగ విడుదల చేయగలుగుతోంది? తెరాస ప్రభుత్వం చెపుతున్న ప్రకారం చూసుకొన్నా కూడా ఈ రెండూ పరస్పరం విరుద్దంగా ఉన్నాయి.