ఈటల నన్ను హత్య చేసేందుకు కుట్ర చేశారు: కౌశిక్ రెడ్డి

హుజురాబాద్‌ ఉపఎన్నికలు ముగిసి చాలా కాలమే అయినప్పటికీ నేటికీ అక్కడ ఈటల రాజేందర్‌, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మద్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఈటల రాజేందర్‌ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఉపఎన్నికలలో నన్ను ఓడించడానికి విఫలయత్నం చేసిన కేసీఆర్‌, నన్ను భౌతికంగా అంతం చేసేందుకే హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఇష్టానుసారం గన్ లైసెన్సులు మంజూరు చేశారు. కనుక నా ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే దానికి కేసీఆరే బాధ్యత వహించాలి,” అని అన్నారు. 

ఈటల చేసిన ఈ ఆరోపణలపై టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ, “అసలు ఈటల రాజేందర్‌ రాజకీయ జీవితమే ఓ రక్త చరిత్ర. తన రక్త చరిత్రను కేసీఆర్‌కు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు నర్సింగాపూర్‌లో తెలంగాణ ఉద్యమకారుడు బాలరాజుని ఈటల రాజేందర్‌ హత్య చేయించారు. అందుకే ఆయన గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు చెప్పులతో తరిమికొట్టారు. ఇది నిజమో కాదో ఈటల రాజేందర్‌ చెప్పాలి. ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్‌పై తన అనుచరులతో దాడి చేయించారు. అతను తృటిలో తప్పించుకొని ప్రాణాలు కాపాడుకొన్నాడు. 

హైకోర్టు న్యావాదులు వామనరావు దంపతుల హత్య కేసులో ఈటల రాజేందర్‌ సన్నిహితుడు ఉన్న మాట నిజమా కాదా చెప్పాలి. మర్రిపల్లిగూడెంలో నన్ను హత్య చేయించడాయికి ఈటల రాజేందర్‌ అనుచరులు ప్రయత్నించారు. అప్పుడు నేను కూడా వారి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాను. 

ఈటల రాజేందర్‌ పైకి చాలా అమాయకుడిలా కనబడతారు కానీ ఆయన భూకబ్జాలు, హత్యా రాజకీయాల గురించి జిల్లాలో చాలా మందికి తెలుసు. నేను చెప్పిన ఈ మాటలకు కట్టుబడి ఉన్నాను. వీటిలో ఒక్క ఆరోపణ తప్పు అని ఈటల రాజేందర్‌ నిరూపించగలిగినా నేను ముక్కు నేలకు రాస్తాను,” అని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.