
రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్ళయింది కానీ ఇంతవరకు రెండు తెలుగు రాష్ట్రాల మద్య అనేక విభజన సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఆయా సమస్యల సంక్లిష్టత కంటే టిఆర్ఎస్, టిడిపి, వైసీపీల రాజకీయ విబేధాలు, వాటి రాజకీయ అవసరాలు, పంతాలు పట్టింపుల కారణంగానే పరిష్కారం కాలేదని చెప్పక తప్పదు. అందుకే వాటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు.
విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావలసిందిగా కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖలు పంపింది. ఈ సమావేశంలో షెడ్యూల్ 9,10లోని ఆస్తులు, సింగరేణి కాలరీస్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఇరు రాష్ట్రాల మద్య బకాయిల చెల్లింపులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు లేఖలలో పేర్కొంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సిఎం కేసీఆర్ కత్తులు దూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని వాదిస్తున్నారు. కేంద్ర హోంశాఖ పంపిన లేఖలలో పేర్కొన్న విభజన సమస్యల జాబితాలో ఏపీకి ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కనుక కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే సిఎం కేసీఆర్ వాదనలను దృవీకరించినట్లయింది. కనుక సిఎం కేసీఆర్ మరోసారి వీటి గురించి ప్రస్తావిస్తూ కేంద్రంపై నిప్పులు చెరగడం ఖాయం.