మునుగోడు ఉపఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా స్రవంతి ఖరారు

మునుగోడు ఉపఎన్నికలకు ఇంకా షెడ్యూల్, నోటిఫికేషన్‌ కూడా వెలువడలేదు కానీ మూడు ప్రధాన పార్టీలు రేపే ఎన్నికలన్నట్లు కసరత్తు చేస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ ఉపఎన్నికలు తెచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్ధిగా మళ్ళీ బరిలో దిగబోతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా దివంగత కాంగ్రెస్‌ నేత పావాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పేరును ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చలమల కృష్ణారెడ్డి కూడా ఈ టికెట్ కోసం పోటీ పడినప్పటికీ చివరికి పాల్వాయి స్రవంతికి దక్కింది. 

ఈ ఉపఎన్నికను సిఎం కేసీఆర్‌ సవాలుగా తీసుకొన్నారు కనుక అభ్యర్ధి విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా తన అభ్యర్ధిని ప్రకటించింది కనుక త్వరలో టిఆర్ఎస్‌ కూడా ప్రకటించవచ్చు. 

రాజకీయ పంతాలు, ఆధిపత్య నిరూపణ కోసమే ఈ ఉపఎన్నిక వచ్చిందని అందరికీ తెలుసు. కనుక మూడు పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం ఖాయం. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు, తెలంగాణ ప్రభుత్వం మునుగోడు అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన చేసి మునుగోడు ప్రజలకు వరాలు ప్రకటించవచ్చు. ఈవిదంగానైనా నియోజకవర్గం అభివృద్ధి చెంది, ఎంతో కొంత లబ్ది కలుగుతుంది కనుక మునుగోడు ప్రజలు కూడా ఈ ఉపఎన్నికలను స్వాగతిస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలు పంతాల కోసం, రాజకీయంగా ప్రత్యర్ధులపై తమ ఆధిపత్య నిరూపించుకొనేందుకు పదవులకు రాజీనామాలు చేసి ఉపఎన్నికలు తీసుకురావడం, దాని కోసం ప్రజాధనం వృధా అవుతుండటం ఏవిదంగా సమర్ధించుకోగలవు?