
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు సంచలన ప్రకటన చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో తాను పోటీ చేయనని ప్రకటించారు. తన బదులు పార్టీ కార్యకర్తను నిలబెడతానని అన్నారు. కానీ ఒకవేళ పార్టీ శ్రేణులు అంగీకరించకపోతే తన భార్య నిర్మల పోటీ చేస్తారని తెలిపారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాతో, పార్టీ అండదండలతో ఎవరూ నెగ్గే పరిస్థితులు లేవు. ఎవరికివారు సొంతబలంతోనే నెగ్గుకొస్తున్నారు. సంగారెడ్డిలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కనుక జగ్గారెడ్డి ఎవరిని నిలబెడితే వారే గెలుస్తారు.
కానీ ఆయన ఎందుకు పోటీ చేయకూడదనుకొంటున్నారు?అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు కానీ అది అందరికీ తెలిసిందే. జగ్గారెడ్డి కూడా పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు కానీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డిని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నారు కూడా. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఆయన అహం అడ్డొస్తోంది కనుక ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.
అయితే పార్టీ కార్యకర్తని నిలబెడతానని చెపుతూనే మళ్ళీ ‘ఎవరూ ఒప్పుకోకపోతే’ అంటూ చిన్న మెలికపెట్టి తన భార్యను బరిలో దించబోతున్నట్లు చెప్పారు. ఒకవేళ జగ్గారెడ్డి మళ్ళీ మనసు మార్చుకోకపోతే చివరికి జరిగేది అదే!