ఈటలపై అనర్హత వేటు?

హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై తెలంగాణ ప్రభుత్వం అనర్హత వేటు వేసేందుకు సిద్దం అవుతోంది. శాసనసభ సమావేశాలను కేవలం మూడు రోజులే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం, నిన్న జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశానికి బిజెపి సభ్యులను ఆహ్వానించకపోవడంపై ఈటల రాజేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “టిఆర్ఎస్‌ ప్రభుత్వం సభా మర్యాదలు, ఆనవాయితీలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. 

రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోయుంటే వాటిపై శాసనసభలో చర్చించే అవకాశం లేకుండా చేసింది. కేసీఆర్‌ ప్రభుత్వం శాసనసభ సమావేశాలు నిర్వహించకుండా తప్పించుకోగలదేమో కానీ ప్రజాక్షేత్రంలో తప్పించుకోలేదు. గతంలో ప్రతిపక్ష పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా బీఏసీ సమావేశానికి ఆహ్వానించేవారు. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం బిజెపి సభ్యులమైన మమ్మల్ని ఆహ్వానించకుండానే బీఏసీ సమావేశం నిర్వహించింది. అప్పుడు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కలుగజేసుకొని సభా సాంప్రదాయాలను పాటించాలని ప్రభుత్వానికి గట్టిగా చెప్పాలి. కానీ ఆయన కేసీఆర్‌ ప్రభుత్వం చేతిలో ఓ మరమనిషిలా మారిపోయినట్లు వ్యవహరిస్తున్నారు,” అని విమర్శించారు. 

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ‘మరమనిషి’ అని అవమానించినందుకు ఈటల రాజేందర్‌ ఆయనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే తగు చర్యలు ఉంటాయని అన్నారు. ఈనెల 12,13న జరుగబోయే శాసనసభ సమావేశాలలో ఆయనపై అనర్హత వేటు వేసేందుకు సభలో తీర్మానం ప్రవేశపెట్టాలని కేసీఆర్‌ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తాజా సమాచారం.